అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, వనపర్తి.
శనివారం వనపర్తి పట్టణంలోని సంఘం ఫంక్షన్ హాల్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం” వేడుకలకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు వికలత్వ భావనతో ఉండరాదని, ఆత్మస్థైర్యంతో, పట్టుదల, ప్రతిభతో రాణించాలని ఆమె అన్నారు. దివ్యాంగులు తమ ప్రతిభతో వివిధ రంగాల్లో రాణించి ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారని ఆమె తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులకు నెలకు రూ 500/- ల పెన్షన్ ఇచ్చేవారని, స్వరాష్ట్రంలో రూ.3016/- లు అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నదని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగులకు అవసరమైన ట్రై సైకిల్ లు, వీల్ చైర్లు, చేతి కర్రలు, త్రీ వీలర్ స్కూటీ లను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. దివ్యంగులకు వికలాంగుల భవనం, వసతి గృహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు.ఈ సందర్భంగా వివిధ కేటగిరీల నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు ఆమె బహుమతుల ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వా న్, మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా సంక్షేమ అధికారిని పుష్పాలత, డి.ఆర్.డి.ఓ. నర్సింహులు, అధికారులు, దివ్యంగులు తదితరులు పాల్గొన్నారు.